పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో శనివారం బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 16 మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు అని క్వెట్టా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) మొహమ్మద్ బలోచ్ తెలిపారు. ఈ ప్రమాదం రైల్వే స్టేషన్‌లోని ఓ ప్లాట్‌ఫారమ్‌లో చోటుచేసుకుంది.
రైలు పెషావర్ కు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఈ బాంబు దాడి జరిగింది అని మొహమ్మద్ బలోచ్ అన్నారు. ఇది ఆత్మాహుతి దాడిగా అనిపిస్తున్నప్పటికీ, విచారణ తరువాతే ఒక నిర్ధారణకు రాగలమని ఆయన అన్నారు.పేలుడు జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు మరియు భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి, అత్యవసర వైద్య సిబ్బంది గాయపడ్డవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
గాయపడినవారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది తీవ్రంగా గాయపడిన వారిని ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.
అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మానవత్వానికి శత్రువులుగా పరిగణించాలని పాకిస్థాన్ తాత్కాలిక అధ్యక్షుడు సయ్యద్ యూసఫ్ రాజా గిలానీ అన్నారు.