సోషల్ మీడియాలో అసభ్యకర , అభ్యంతరకర పోస్టులు పెట్టె వారి పై కేసులు నమోదు చేయడంలో పోలీసులకు హక్కు ఉందని ఏపీ హై కోర్టు స్పష్టం చేసింది. అలాగే పోలీసులను ఈ చర్యలు చేపట్టకుండా ఆపలేమని తెలిపింది. సోషల్ మీడియా అనేది తమ ఇష్టానుసారంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి లేదా దుష్ప్రచారానికి చేయడానికి వేదిక కాదని, ఈ వేదికను దుర్వినియోగం చేసినవారు చట్టం ముందు నిలబడవలసిందేనని కోర్టు హెచ్చరించింది. న్యాయమూర్తులను కూడా వదలకుండా సోషల్ మీడియా పోస్టుల్లో అవమానించారని కోర్టు గుర్తుచేసింది. తనపై నమోదైన కేసు అన్యాయమని భావిస్తే, వ్యక్తిగతంగా క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని కోర్టు సూచించింది.
హై కోర్టులో జర్నలిస్టు పోలా విజయబాబు దాఖలు చేసిన పిల్‌ను కోర్టు తిరస్కరించిన సందర్భంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది . సోషల్ మీడియా పోస్టులపై కేసులు నమోదు చేస్తూ, సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తున్నారంటూ పోలీసులపై విజయబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన తరఫు న్యాయవాది ఎస్. శ్రీరామ్ వాదన ప్రకారం, పోలీసు వ్యవస్థ వివక్షతో వ్యక్తులను అరెస్టు చేస్తూ, వారి వాక్ వాక్ స్వాతంత్య్రాన్ని హరించుతోందని పేర్కొన్నారు.
అయితే, కోర్టు దీనికి సమాధానంగా, అనేక మంది సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ ఇతరులను దూషిస్తూ, అసభ్యకర కంటెంట్ పోస్ట్ చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, అటువంటి వారి మీద పోలీసులు చర్యలు తీసుకోవడంలో తప్పేమీ లేదని తెలిపింది. వందల మంది ఒకే ఉద్దేశంతో హానికర పోస్టులు పెడుతున్నప్పుడు, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తప్పు కాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో పిల్ దాఖలు చేయడం తగదని కోర్టు సూచించింది, అలాగే సంబంధిత వ్యక్తులు తమపై నమోదైన కేసులు వ్యతిరేకిస్తూ వ్యక్తిగత పిటిషన్లు దాఖలు చేసుకోవాలని సూచించింది. పోలీసులు దర్యాప్తు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంటే, ప్రభుత్వాన్ని ఆపడం సరికాదని కోర్టు తేల్చి చెప్పింది.