హైదరాబాద్లోని సంధ్యా 70 MM థియేటర్ వద్ద పుష్ప 2 సినిమా స్క్రీనింగ్ సమయంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బుధవారం రాత్రి అల్లు అర్జున్ సినిమా స్క్రీనింగ్ కు హాజరవడంతో భారీ జనసందోహం అక్కడకు చేరుకుంది. అయితే, ఈ ఉత్సాహం కాస్త తోపులాటకు దారితీసింది.
దీంతో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ తోపులాటలో 35 ఏళ్ల రేవతి అనే మహిళ మృతి చెందగా తన 9 ఏళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆమె భర్త మరియు కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆసుపత్రికి తరలించినా, రేవతి అప్పటికే మరణించింది. కాగా బాలుడి పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై మైత్రీ మూవీ మేకర్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. వారు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ, ఈ సమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాలుడు తొందరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు.
థియేటర్ వద్ద పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని కంట్రోల్ చేశారు. బాధిత కుటుంబం థియేటర్ గేటు వద్ద నిలబడి ఉండగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇక పుష్ప 2 కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తుంది. 2024లో భారీగా ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలవనుంది. సుకుమార్ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీలో అల్లు అర్జున్ లీడ్ రోల్ లో నటించగా , రష్మిక మందన , మరియు ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటించారు.