బాలసుబ్రహ్మణ్యన్ చిదంబరం అనే భారతీయ వ్యక్తి , ఓ సాధారణ ప్రాజెక్ట్ ఇంజనీర్ గా గత 21 ఏళ్లుగా సింగపూర్‌లో పని చేస్తున్నాడు. తన కుటుంబంతో కలిసి ఓ సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే అనుకోకుండా రాత్రికి రాత్రే అతని తలరాత మారిపోయింది. వివరాల్లోకి వెళ్తే ఓ రోజు సింగపూర్‌లోని లిటిల్ ఇండియా ప్రాంతంలో షాపింగ్ చేస్తూ భార్య కోసం గిఫ్ట్ గా నెక్లెస్ కొనిద్దాం అనుకున్నాడు.
అక్కడి ముస్తాఫా జ్యువెలరీ షాపులోకి వెళ్లి బాలసుబ్రహ్మణ్యన్ తన భార్య కోసం బంగారు గొలుసులు కొనుగోలు చేశాడు . వాటి కోసం 6,000 సింగపూర్ డాలర్లు ఖర్చు పెట్టాడు. అంటే మన కరెన్సీ లో సుమారు 3,80,000 ఉంటుంది. అయితే అతను కలలో కూడా అనుకోలేదు భార్య కోసం కొనిచ్చిన గిఫ్ట్ అతడిని కోటీశ్వరుడిని చేస్తుందని.
ఆ రోజు రానే వచ్చింది. నవంబర్ 24, ఆదివారం, వారి జీవితాన్ని ఊహించని విధంగా మలుపుతిప్పింది. ఆ రోజు ముస్తాఫా జ్యువెలరీ వారు లక్కీ డ్రా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో, కనీసం 250 సింగపూర్ డాలర్లు అంటే 15,000 రూపాయలు ఖర్చు చేసిన కస్టమర్లందరికీ లక్కీ డ్రా కి అర్హత పొందుతారు.
ఆ రోజు లక్కీ డ్రాలో బాలసుబ్రహ్మణ్యన్ 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. అంటే దాదాపు 8 కోట్ల రూపాయలు పైనే ఉంటుంది . తాను ఈ బహుమతి గెలుచాను అని తెలియగానే ఆనందంతో ఏడ్చేశాడు. వీడియో కాల్‌లో ఆయన కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఎందుకంటే ఆ రోజు అతనికి ఎంతో ప్రత్యేకం. తన తండ్రి మరణించి సరిగ్గా అదేరోజుకి నాలుగేళ్లు అవుతుంది. తను విజేతగా నిలవడానికి తన తండ్రి ఆశీర్వాదంగా బాలసుబ్రహ్మణ్యన్ భావిస్తున్నాడు.
ఈ వార్తను విని ఆయన భార్య చాలా సంతోషించింది. తన తల్లితో కూడా త్వరలో తన ఆనందాన్ని పంచుకుంటానని ఆయన అన్నాడు. సింగపూర్ లో తను హ్యాపీ గా ఇన్నేళ్లు ఉన్నందుకు గాను తన కమ్యూనిటీకి ఏంతో కొంత సాయం చేస్తానని బాలసుబ్రహ్మణ్యన్ అన్నాడు.