తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పారిశ్రామిక ప్రాజెక్టు కోసం లగచర్లలో భూముల సేకరణను చేపట్టాలని భావించింది. కానీ స్థానిక రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవ్వడంతో ఈ భూసేకరణను నిలిపివేయాలని నిర్ణయించింది.
గతంలో పరిశ్రమల నిర్మాణానికి 632 ఎకరాల భూసేకరణ చేయాలి అని ప్రభుత్వం భావించింది. ఆగస్టు 1న దీనికి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, స్థానిక ప్రజలు, రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. భూములు కోల్పోతామనే ఆందోళనతో పాటు ముఖ్యంగా ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రాజెక్టు వల్ల స్థానిక ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వం కూడా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ రైతులు అంగీకరించలేదు. రోజురోజుకి నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. లగచెర్ల గ్రామంలో స్థల సేకరణ నిమిత్తం విచ్చేసిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై కొందరు స్థానికులు దాడికి పాల్పడ్డారు. ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు.
అయితే పరిస్థితిని సమీక్షించి, ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణని రద్దు చేయాలని నిర్ణయించింది.