ప్రస్తుతం భారతదేశంలో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా, ఆ దేశంలో ఇటీవల జరిగిన హింసను ఖండించారు. న్యాయవాది సైఫుల్ ఇస్లాం హత్యను అలాగే హిందూ మత గురువు చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్టును ఆమె తీవ్రంగా ఖండించారు. చిన్మయ్ కృష్ణ దాస్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రార్ధన స్థలాల పై దాడులను షేక్ హసీనా ఖండించారు. చిట్టగాంగ్‌లోని ఒక దేవాలయాన్ని తగులబెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ, గతంలో గుడులు ,మసీదులు, అహ్మదియా సమాజానికి చెందిన ఇళ్ళను టార్గెట్ చేసి దాడులు జరిపారని పేర్కొన్నారు. అన్ని మతాలకు చెందిన ప్రజలకు భద్రతను కాపాడటంప్రభుత్వం యొక్క బాధ్యత అని ఆమె గుర్తుచేశారు.
చిన్మయ్ కృష్ణ దాస్‌కు బెయిల్ నిరాకరించిన తర్వాత, అతని అనుచరులు మరియు భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ న్యాయవాది చనిపోయారు.
ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని, షేక్ హసీనా తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం అక్రమంగా అధికారాన్ని స్వాధీనం చేసుకుందని, మానవ హక్కులను కాపాడడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం చర్యలను ఉగ్రవాద చర్యలతో పోల్చిన హాసీనా, న్యాయవాది హత్యకు బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.
న్యాయం చేయడంలో ప్రభుత్వం గనుక విఫలమైతే మానవ హక్కుల ఉల్లంఘనలకు అది కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుందని హసీనా హెచ్చరించారు. ప్రజలందరూ హింస మరియు భత్రతకు వ్యతిరేకంగా ఏకమవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో ప్రతీ ఒక్కరి భద్రతను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే అని ఆమె గుర్తుచేశారు.