13 ఏళ్లకే క్రికెట్ లో ప్రతిభ కనబరుస్తున్న బీహార్ కి చెందిన వైభవ్ సూర్యవంశీ, ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరిగిన IPL 2025 వేలం పాటలో రెండో రోజు రాజస్థాన్ రాయల్స్ (RR) అతన్ని ₹1.10 కోట్లకు కొనుగోలు చేసింది. డిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన పోటాపోటీలో వైభవ్ ని రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది.
ఎవరీ వైభవ్ సూర్యవంశీ?
2011లో జన్మించిన వైభవ్, నాలుగేళ్ల వయసులోనే తన క్రికెట్ ప్రతిభను ప్రదర్శించడం ప్రారంభించాడు. వైభవ్ కు క్రికెట్ మీద ఉన్న ఇష్టాన్ని గుర్తించి, తమ ఇంటి వెనుక భాగంలో చిన్న క్రికెట్ మైదానాన్ని ఏర్పాటు చేశారు. తొమ్మిదేళ్ల వయసులో,వైభవ్ని తన తండ్రి సమస్తిపూర్ క్రికెట్ అకాడమీలో చేర్పించారు. అతి తక్కువ కాలంలోనే తన సహచరులను మించిన ప్రతిభను వైభవ్ కనబరిచాడు .
రంజీ మాజీ ఆటగాడు మనీష్ ఒజ్హా శిక్షణలో వైభవ్ రాటుదేలాడు. కేవలం 12 ఏళ్ల వయసులోనే అతను వినూ మాంకడ్ ట్రోఫీలో 5 మ్యాచ్‌లలో 400 పరుగులు చేసి తన ప్రతిభను చాటుకున్నాడు. ఆస్ట్రేలియా U-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 58 బంతుల్లో శతకం సాధించి అతను క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.తన అద్భుతమైన ప్రదర్సనతో ఇండియా అండర్-19 లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.