కే.సీ.ఆర్ ను మరియు వారి కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు గద్దె దించండం వల్లే నిరుద్యోగులకు ఇప్పుడు ఉపాధి లభిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ ను కొరివి దెయ్యం గా ఆయన వర్ణించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత ప్రాణ త్యాగం చేసి చివరికి కొరివి దెయ్యాన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని దీని వల్ల వారు దశాబ్ద కాలం పాటు అనేక అవకాశాలను కోల్పోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
బుధవారం రోజున టీచర్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణులయిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. విద్యారంగం అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం అన్నారు. డి.ఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన 65 రోజుల్లోనే 10,006 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఆలాగే పవర్ లోకి వచ్చిన 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ అన్నారు. కొత్తగా నియమితులైన టీచర్ల ఉత్సాహం చూస్తుంటే ఇప్పుడే దసరా పండుగ వచ్చినట్లుందని ఆయన అన్నారు.
గత తొమ్మిదేళ్లలో బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం టీచర్ల ప్రమోషన్లు, బదిలీలను నిలిపివేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 34,000 మంది టీచర్లను బదిలీ చేశామని 21,000 మందికి పదోన్నతులు కల్పించామని రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ విద్యార్థుల కోసం మెరుగైన విద్యను అందించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కొత్తగా ఎంపికైన టీచర్లను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.