- ప్రముఖ బ్రాండ్లకు చెందిన మసాలా ఉత్పత్తులు బ్యాన్!
- బ్యాన్ చేసిన సింగపూర్, హాంగ్ కాంగ్
- కాన్సర్ కారకాలు ఉన్నాయని వెల్లడి
ప్రముఖ మసాలా ఉత్పత్తులు తయారు చేసే ఎం.డి.హెచ్, ఎవరెస్ట్ సంస్థలకు చెందిన నాలుగు ఉత్పత్తులను హాంగ్ కాంగ్ ఫుడ్ సేఫ్టీ విభాగం నిషేదించింది. ఈ నెల ఏప్రిల్ 5వ తారీఖున చేసిన తనిఖీల్లో భాగంగా ఇథిలీన్ ఆక్సైడ్ అనే కెమికల్ ను ఇందులో అధిక మోతాదుల్లో వాడుతున్నారని హాంగ్ కాంగ్ ఫుడ్ సేఫ్టీ విభాగం అనౌన్స్ చేసింది. ఇది కాన్సర్ కారకం అని అధికారులు అంటున్నారు.
ఎం.డి.హెచ్ కు చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, మిశ్రమ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా ఇంకా ఎవరెస్ట్ బ్రాండ్ కు చెందిన ఫిష్ కర్రీ మసాలా పౌడర్ లో ఇథిలీన్ ఆక్సైడ్ కెమికల్ ను అధికారులు గుర్తించారు. అయితే వీటికి సంభందించిన ఉత్పత్తులను స్టాక్ నుండి తీసేయవలసిందిగా డీలర్లను హాంగ్ కాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ విభాగం ఆదేశించింది. దర్యాప్తు ప్రారంభించామని ఈ సంస్థల మీద తగిన చర్యలు తీసుకుంటామని సెంటర్ ఫర్ సేఫ్టీ అధికారులు తెలియజేసారు.
హాంగ్ కాంగ్ నుండి వచ్చిన సమాచారం మేరకు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ కూడా ఎవరెస్ట్ సంస్థకు చెందిన ఫిష్ కర్రీ మసాలా పౌడర్ ఉత్పత్తులను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇథిలీన్ ఆక్సైడ్ అనే కెమికల్ తక్కువ మోతాదులో వాడితే ఆరోగ్యానికి అంత ప్రమాదం కాకపోయినా ఎక్కువ మోతాదులో వాడితే మనిషి ఆరోగ్యానికి హానికారం అని సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ అధికారులు చెబుతున్నారు.
ఇక ఈ విషయాంపై ఎండీహెచ్, ఎవరెస్ట్ సంస్థల నుండి సమాధానం రావాల్సి ఉంది.