- కేరళ సీఎంపై బీజేపీ మౌనం వహిస్తుంది: రాహుల్ గాంధీ
- పినారాయ్ విజయన్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదన్న రాహుల్ గాంధీ
- రాహుల్ గాంధీపై మండిపడ్డ కేరళ సీఎం పినారాయ్ విజయన్
- మీ నానమ్మ ఇందిరా గాంధీ మమ్మల్ని జైల్లో పెట్టింది : కేరళ సీఎం
- CAA చట్టం పై రాహుల్ గాంధీ వైఖరి ఏంటి? : కేరళ సీఎం
ప్రతిపక్ష పార్టీల సీఎంల మీద చర్యలు తీసుకున్నట్టు కేరళ సీఎం పినారాయ్ విజయన్ మీద బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేరళ సీఎం బదులిచ్చారు. “మీ నానమ్మ మమ్మల్ని ఏడాదిన్నర పాటు జైల్లో పెట్టింది” అని బదులిచ్చారు.
కేరళలోని కోజీకోడ్ లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న కేరళ సీఎం “బీజేపీ ప్రభుత్వం నా మీద ఎందుకు దాడికి దిగట్లేదని రాహుల్ గాంధీకి చాలా బాధగా ఉన్నట్లుంది. నన్ను కస్టడీలోకి ఎందుకు తీసుకోవడంలేదని ఆయన చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఎమర్జెన్సీ టైంలో ఏడాదిన్నర పాటు మీ నానమ్మ “ఇందిరా గాంధీ ” మమ్మల్ని జైల్లో పెట్టింది. దేశం మొత్తం అణచివేతకు గురైంది. ముందు రాహుల్ గాంధి అది గుర్తుపెట్టుకోవాలి అని పినారాయ్ విజయన్ అన్నారు.
గురువారం రోజు కేరళలోని కన్నూర్ ప్రాంతంలో జరిగిన ర్యాలీ లో “నేను బీజేపీ మీద రోజూ యుద్ధం చేస్తుంటే ఈ కేరళ సీఎం నా మీద యుద్ధం చేస్తున్నాడు. నాకు ఎదో అనుమానంగా ఉంది” అని రాహుల్ గాంధీ అన్నారు.
అయితే కేరళ సీఎం కూతురు వీణా కి చెందిన ఐటీ కంపెనీలో చోటు చేసుకున్న కుంభకోణంపై కేంద్రానికి చెందిన ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయ్ కాబట్టే సీఎం పినరాయ్ విజయన్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అంటున్నారు.
అయితే శుక్రవారం జరిగిన మీటింగ్ లో CAA చట్టంపై రాహుల్ గాంధీ వైఖరి ఏంటి? CAA చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎందుకు నిరసనలు తెలియజేయలేదు? అంటూ పినరాయ్ విజయన్ మండిపడ్డారు. CAA చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన నిరసనల్లో ఒక్క కాంగ్రెస్ లీడర్ కూడా ఎందుకు అరెస్ట్ కాలేదని ఆయన అన్నారు. అలాగే నేను ఎలాంటి దర్యాప్తు సంస్థలకు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.