- శివారు ప్రాంతంలో గల చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్
- గరుడ ప్రసాదం భక్తులకు పంపిణీ
- సోషల్ మీడియా ద్వారా తెలియడంతో చిలుకూరు ఆలయానికి బారులు తీరిన భక్తులు
- ప్రసాదం కోసం సంతానం లేని వారు తెల్లవారు జాము నుండి పెద్ద ఎత్తున క్యూ
- తీవ్ర ఇబ్బందులు పడిన విద్యార్థులు, ఉద్యోగులు
హైదరాబాద్ లోని శివారు ప్రాంతంలో గల చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే ఈ రోజు ఉదయం అయిదింటి నుండి వేల సంఖ్యలో భక్తులు చిలుకూరు ఆలయానికి చేరుకున్నారు. ఈ రోజు గరుడ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా సంతానం లేనివారికి ప్రసాదం పంపీణీ చేస్తున్నారని సోషల్ మీడియా ద్వారా తెలియడంతో భక్తులు చిలుకూరు ఆలయానికి బారులు తీరుతున్నారు.
ఈ రోజు నుండి వారం రోజుల పాటు చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే ఈ గరుడ ప్రసాదం కోసం సంతానం లేని వారు తెల్లవారు జాము నుండి పెద్ద ఎత్తున క్యూ కట్టడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.
మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, అప్పా జంక్షన్ మీదుగా చిలుకూరు ఆలయం వరకు ట్రాఫిక్ జాం స్తంభించింది. దీంతో స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ట్రాఫిక్ పోలీసులు చేరుకొని పరిస్థితిని చక్కపెడుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయిన కారణంగా ఈ మార్గంలోకి రావద్దని ట్రాఫిక్ పోలీసులు అభ్యర్థిస్తున్నారు.