గత కొద్ది కాలంగా బెంగుళూరు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న 38 ఏళ్ల మంజునాద్ అనే దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను బెంగుళూరు సిటీ పరిసరాల్లో దాదాపు 50కి పైగా చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
మంజునాద్ చోరీకి పాల్పడే విధానం పోలీసులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది. మొదట సెక్యూరిటీ లేని బిల్డింగ్ లను ఎంచుకుంటాడు. ఆ తర్వాత తన ప్లాన్ అమలు పరుస్తాడు. ప్లాన్ చాలా సింపుల్ మొదట ఒకటో రెండో పావురాలను బిల్డింగ్ మీదకి వదులుతాడు. అది బిల్డింగ్ మీద వాలగానే లోపలికి వెళ్తాడు. తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ గా చేసుకుని ఐరన్ రాడ్ తో దాన్ని బద్దలు కొట్టి చోరీకి పాల్పడుతాడు. ఎక్కువగా క్యాష్, గోల్డ్ ఆభరణాలు చోరీ చేస్తాడు. ఆ పిమ్మట ఆభరణాలను బెంగుళూరుకి దగ్గర్లో ఉన్న హోసూర్ లో అమ్మేస్తాడు.
ఇక ఎవరికైనా ఇతడ్ని చూసి అనుమానిస్తే పావురాల్ని పట్టుకోవడానికి వచ్చానని ఎదో కధలు చెప్పేవాడు. తాళాలు వేసుకుని ఆఫిసులకు వెళ్లిపోయే వారి ఇళ్లే మంజునాద్ కు టార్గెట్ . గతంలో అనేక సార్లు జైలుకు వెళ్లి వచ్చినా ఇతడి బుద్ది మారలేదు. వరుస దొంగతనాలతో పరిసర ప్రాంతల వారిని కొన్నాళ్ల పాటు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ దొంగ ని పోలీసులు అరెస్ట్ చేయడంతో జనాలు ఊపిరిపీల్చుకున్నారు.