విధి ఓ బాలుడ్ని కొద్దీ సేపు కోటీశ్వరుడ్ని చేసింది. కానీ ఆ ఆనందం ఎక్కువ సేపు నిలువలేదు. ఎలా అనుకుంటున్నారా, వివరాల్లోకి వెళ్తే బీహార్ లోని ముజఫర్ పూర్ కి చెందిన 15 ఏళ్ల సైఫ్ అలీ అనే బాలుడు ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్లేముందు. 500 రూ. విత్‌డ్రా చేసుకోవడానికి పక్కనే ఉన్న ఏటీఎం సెంటర్ కి వెళ్ళాడు. డ్రా చేద్దామని చూసేలోపు తన బ్యాంక్ ఖాతాలో రూ. 87 కోట్ల 65 లక్షలు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. సైఫ్ మరియు ఇంటర్నెట్ కేఫ్ యజమాని కూడా అకౌంట్ బ్యాలెన్స్‌ని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేశారు. చూస్తే సైఫ్ అలీ అకౌంట్ లో నిజంగానే 87 కోట్ల 65 లక్షలు ఉన్నాయి.
వెంటనే ఇంటికి వెళ్లిన సైఫ్ తన తల్లితో ఈ వార్తను పంచుకున్నాడు. ఆశ్చర్యపోయిన తల్లి స్థానికంగా ఉండే ఓ బాలుడి సహాయం తీసుకుని కస్టమర్ సర్వీస్ పాయింట్ కి వెళ్లారు. అక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ను చెక్ చేయగా బ్యాలెన్స్ కాస్త 532 రూపాయలుగా చూపింది. తరువాత తన బ్యాంక్ అకౌంట్ కూడ ఫ్రీజ్ అయ్యిందని సైఫ్ అలీ తెలుసుకున్నాడు.
సైఫ్ మరియు అతని కుటుంబం ఈ వ్యహారాన్ని బ్యాంకు దృష్టికి తీస్కువెళ్ళినప్పుడు అక్కడి అధికారులు భారీ మొత్తంలో అమౌంట్ సైఫ్ అలీ అకౌంట్ కి బదిలీ అవ్వడాన్ని ధృవీకరించారు, అయితే ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగిందో బ్యాంకు అధికారులు వివరించలేకపోయారు.అయితే నార్త్ బీహార్ గ్రామీణ బ్యాంక్, సైబర్ గ్యాంగ్ ముఠా ఈ మోసానికి ఒడిగట్టి ఉంటారని అనుమానిస్తూ అంతర్గత విచారణ ప్రారంభించింది. ఇక సైఫ్ అలీ కుటుంబం ఈ ఉదంతంపై ఫిర్యాదు చేయడానికి ఇష్టపడలేదు.