ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల మందికి పైగా ప్రజలు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారని యు.కెకి చెందిన లాన్సెన్ట్ జర్నల్ పత్రిక ఓ కధనం ప్రచురించింది. పెద్దల్లోనే కాకుండా, చిన్న పిల్లల్లో, టీనేజర్స్ లో ఊబకాయం సమస్య ఉందని నివేదిక తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో N.C.D రిస్క్ ఫాక్టర్ కొలాబరేషన్ అనే సంస్థ చేసిన పరిశోధనాల్లో ఈ విషయం వెల్లడయ్యింది.
1990వ సంవత్సరంతో పోల్చితే 2022 నాటికి చిన్న పిల్లల్లో మరియు టీనేజర్స్ లో ఊబకాయం సమస్య నాలుగు రేట్లు పెరిగినట్లు నివేదిక తెలిపింది. మహిళల్లో ఊబకాయం సమస్య రెండు రేట్లు పెరగగా, పురుషుల్లో ఈ సమస్య మూడు రేట్లు పెరిగినట్లు తెలిపింది. ఇక 2022 లో 15 కోట్ల మందికి పైగా చిన్న పిల్లలు అధిక బరువుతో సతమతమవుతుండగా, 87 కోట్ల మందికి పైగా పెద్దలు ఈ సమస్యను ఎదుర్కుంటున్నారని నివేదిక తెలిపింది.
ఆసక్తికరంగా 1990వ దశకంలో తక్కువ బరువు సమస్య తో ప్రజలు బాధపడగా, ఇప్పుడు ఈ సమస్య చాలా వరుకు తగ్గిందని నివేదిక వెల్లడించింది. 190 దేశాల్లో, 1500 పరిశోధకులు, 22 కోట్ల మందికి పైగా ప్రజలపై పరీక్షలు చెయ్యగా ఈ విషయం తెలిసింది.
ప్రపంచవ్యాప్తంగా పెరిగి పోతున్న ఈ ఊబకాయ సమస్య కు చెక్ పెట్టాలంటే, ఆరోగ్యాన్ని ఇచ్చే, పోషకాలు అధికంగా ఉండే, ఆహరం తీసుకోవాలని లండన్ కి చెందిన ఇంపీరియల్ కాలేజ్ ప్రొఫెస్సర్ మాజిద్ ఎజ్జాతి అభిప్రాయపడ్డారు.